Double Decker Bus: హైదరాబాద్లో ఇప్పటికే డబుల్ డెక్కర్ బస్సుల సందడి మొదలైంది. ఈ-ప్రిక్స్ సందర్భంగా మూడు బస్సులను హెచ్ఎండీఏ నడిపింది. ఐతే త్వరలోనే ఆర్టీసీ కూడా 10 బస్సులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
HYDERABAD TELANGANA RTC LIKELY TO RUN 10 DOUBLE DECKER BUSES IN HYDERABAD CITY HERE ARE MORE DETAILS
హైదరాబాద్లో మరో 10 డబుల్ డెక్కర్ బస్సులను (Double Decker Buses) నడపాలని తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.
మెట్రో మార్గం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అందువల్ల కేవలం పరిమిత మార్గాల్లో మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
డబుల్ డెక్కర్ బస్సులపై నగరవాసులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ ఫార్ములా రేసింగ్ సందర్భంగా నగరానికి వచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను చూసేందుకు..వాటిలో ఎక్కేందుకు ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తే… వాటికి ఆదరణ పెరిగి.. ఆర్టీసీకి కూడా లాభదాయకంగా ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే 10 బస్సులను నగర రోడ్లపై తిప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్కు ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చాయి. ఫార్ములా ఈ-రేసింగ్ సందర్భంగా వాటిని నగర రోడ్లపై తిప్పారు. ఆ బస్సుల నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏ చూసుకుంటోంది. త్వరలోనే వీటిని చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో నడపనున్నారు.
హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన సంప్రదాయ డబుల్ డెకర్ బస్సులు 2003 వరకు హైదరాబాద్లో తిరిగాయి. కాలం చెల్లడంతో ఆ తర్వాత పక్కనబెట్టారు. ఐతే నగరవాసుల కోరిక.. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెకర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చారు.
ఇప్పటికే మూడు బస్సులు నగరానికి చేరుకోగా.. మరో మూడు త్వరలోనే రానున్నాయి. వాటిని టూరిజం కోసం వినియోగించనున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం ఆర్టీసీ కూడా 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Leave a Reply