ట్రాఫిక్ జరిమానాలను (Traffic Challan) వసూలు చేసేందుకు కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 11 లోపు చలాన్లను చెల్లించే వారికి 50 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది.
బెంగళూరు: వివిధ సందర్భాల్లో ట్రాఫిక్ నిబంధనలను (Traffic rules) అతిక్రమించిన వారిపై విధించిన చలాన్లను (Challan)ను వసూలు చేసేందుకు కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీలోపు చలాన్లను పూర్తిగా చెల్లించే వారికి మొత్తం జరిమానాలో 50 శాతం మేర రాయితీ (Rebate) ఇస్తున్నట్లు కర్ణాటక రవాణాశాఖ వెల్లడించింది. ఈ మేరకు రవాణాశాఖ కార్యదర్శి పుష్ప ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం బెంగళూరు నగరంలోనే రెండు కోట్లకు పైగా ట్రాఫిక్ అతిక్రమణ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటి ద్వారా దాదాపు రూ.500 కోట్ల మేర జరిమానా వసూలు కావాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం జరిమానా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటన్నింటినీ వీలైనంత త్వరగా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు మహానగరం పరిధిలో చలాన్లను చెల్లించాలనుకునే వారు దగ్గర్లోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని, లేదంటే అధికారిక వెబ్సైట్ https://bangalore trafficpolice.gov.in ద్వారా కూడా చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల ప్రజలు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో చెల్లించవచ్చని అన్నారు. కర్ణాటక వన్ పోర్టల్‌ను ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.