సింహగిరి ఘాట్‌రోడ్డులో విద్యుత్తు బస్సు నడిపేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో బస్సు కొనుగోలుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
కొనుగోలుకు సన్నాహాలు & సామర్థ్య పరీక్షకు తీసుకొచ్చిన బస్సు
సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరి ఘాట్‌రోడ్డులో విద్యుత్తు బస్సు నడిపేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో బస్సు కొనుగోలుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా విద్యుత్తు బస్సుల సంస్థతో రెండు బస్సుల కొనుగోలుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు గురువారం 42సీట్ల సామర్థ్యం కలిగిన డెమో విద్యుత్తు బస్సును సింహాచలం తీసుకువచ్చారు. రూ.1.65 కోట్ల విలువైన ఇలాంటి రెండు బస్సులను దేవస్థానం కొనుగోలు చేయనుంది. వీటితోపాటు రూ.18లక్షల విలువైన రెండు ఛార్జర్లను కూడా సమకూర్చనున్నారు.
డెమో వాహనంతో సింహగిరి ఘాట్‌రోడ్డులో సామర్థ్య పరీక్ష నిర్వహించారు. బస్సు పొడవు, వెడల్పు, ఇంజిన్ సామర్థ్యం ఘాట్‌రోడ్డుకు అనుకూలంగా ఉందో.. లేదో పరిశీలించారు. బస్సు పొడవు, ఎత్తు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డిజైన్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం జరగనున్న దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యుల ఎదుట బస్సును ప్రదర్శించి తదనంతర నిర్ణయాలు తీసుకోనున్నారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ఈఈ శ్రీనివాసరాజు, ఏఈ హరి, తదితరులకు ఒలెక్ట్రా సంస్థ సిబ్బంది బస్సు వివరాలు తెలియజేశారు.
Leave a Reply